ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. భారత్‌లోని తన వినియోగదారుల కోసం ”పే లేటర్ (Pay Later) ” పేరిట ఓ నూతన సౌకర్యాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. గతంలో అమెజాన్ పే ఈఎంఐ పేరిట వస్తువులను ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసేందుకు కస్టమర్లకు అమెజాన్ అవకాశం కల్పించింది. కాగా ఇప్పుడు పే లేటర్ పేరిట క్రెడిట్ లిమిట్ సదుపాయాన్ని అందిస్తూ.. మరో నూతన ఫీచర్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.
అమెజాన్ పే లేటర్ పలువురు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది. దీన్ని త్వరలోనే అమెజాన్ కస్టమర్లందరికీ అందివ్వనున్నారు. ఇక ఈ సర్వీస్ కేవలం యాప్‌లోనే వినియోగదారులకు లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకోవాలంటే.. అమెజాన్ యాప్‌లోకి లాగిన్ అయ్యి అందులోని డ్యాష్‌బోర్డులో ఉండే పే లేటర్ సర్వీస్‌లోకి వెళ్లి.. కేవైసీ సహాయంతో రిజిస్టర్ చేసుకోవాలి. అన్నీ సరిగా ఉంటే.. రూ.60వేల వరకు కస్టమర్లకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. ఇక పే లేటర్ సహాయంతో ఏదైనా వస్తువును అమెజాన్‌లో కొనుగోలు చేస్తే.. 12 నెలల వరకు ఈఎంఐ సదుపాయం లభిస్తుంది. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన పనిలేదు.
ఇక ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే పే లేటర్ సర్వీస్‌ను అందిస్తున్నా.. అందులో కస్టమర్ ప్రొఫైల్‌ను బట్టి ఆ కంపెనీ క్రెడిట్ లిమిట్‌ను అందిస్తోంది. అయితే ఆ సర్వీస్‌లో ఈఎంఐ ఫెసిలిటీ లేదు. కస్టమర్ ఒక నెలలో పే లేటర్ ద్వారా కొన్న వస్తువులకు గాను అయ్యే మొత్తాన్ని మరుసటి నెల 10వ తేదీ లోగా చెల్లించాలి. కానీ అమెజాన్ అలా కాకుండా ఈఎంఐ సౌకర్యాన్ని కూడా తన పే లేటర్ సర్వీస్‌లో అందిస్తోంది..!