రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌ షా

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగసభలో రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి భుజం తట్టి అమిత్ షా అభినందించారు. అనంతరం ఇద్దరూ చేతులు పట్టుకుని పైకి ఎత్తారు. మునుగోడు సభకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా హాజరయ్యారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ తదితరులు స్టేజ్ పై ఆశీనులయ్యారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. కాసేపట్లో అమిత్ షా ప్రసంగించబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే నిన్న టీఆర్‌ఎస్‌ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో పాల్గొని ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రి పలు ప్రశ్నలు సంధించారు.