చిదంబ‌రంపై అమిత్ షా మార్క్ రివేంజ్‌…!

-

అధికారంలో ఉన్న నేత‌లు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై కేసులు న‌మోదు చేయించ‌డం, ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం రాజ‌కీయాల్లో స‌ర్వసాధ‌ర‌ణ‌మే. ఇది అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ వ‌ర్తిస్తుంది. తాజాగా.. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య కూడా ఇదే సీన్ క‌నిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత చిదంబ‌రం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

అలాగే.. అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఉన్నారు. ఎఫ్ఐపీబీ ఆమోదం వెనుక అవకతవకలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే..ఈ కేసులో చిదంబ‌రంను సీబీఐ, ఈడీ అధికారలు విచారించిన అనంతరం ఏక్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

దీంతో అప్ర‌మ‌త్తం అయిన చిదంబ‌రం లాయ‌ర్లు ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని కోరారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ కేసు వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఒక్క‌సారి గ‌తంలోకి వెళ్తే… కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీల‌క పాత్ర పోషించారు.

ఇక ఇదే సమయంలో గుజరాత్‌ హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. అయితే, పలు కేసుల్లో అమిత్‌షాను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేయించి.. జైల్లో వేయించారు. ఇందులో అప్ప‌ట్లో సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఎన్‌కౌంట‌ర్లో అమిత్‌ షా హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు అప్ప‌ట్లో ఆరోపణలున్నాయి. అయితే.. ఈ కేసులో అమిత్‌ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు.

ఆ తరువాత ఆయనకు గుజరాత్‌ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అందులో అమిత్‌షా హోంశాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో చిదంబ‌రంపై అమిత్‌షా ప్ర‌తీకార చ‌ర్య‌కు దిగుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చిదంబ‌రంను ఎలాగైనా జైలుకు పంపాల‌ని అమిత్‌షా చూస్తున్నార‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news