దశాబ్ధాల నాటి అయోధ్య రామజన్మభూమి వివాదానికి నవంబరులో సుప్రీంకోర్టు పరిష్కారం చూపించిన విషయం తెలిపిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కేంద్రానికి సూచించింది కోర్టు. అయితే చారిత్రాత్మక తీర్పు వచ్చిన తర్వాత అందరిలోనే ఒకటే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదే.. రామ మందిర నిర్మాణం ఎప్పుడు? ఎప్పటి లోగా రాముని గుడి కడతారు? అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.
అయితే తాజగా ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించిందని.. త్వరలోనే అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. ఝార్ఖండ్‌లోని పాకూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.