ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు 80వేల మంది పంజాబ్ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. గల్లీ నుంచి ప్రధాన రహదారులు ఇలా అన్ని ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రోజున అమృత్‌పాల్ కారులో వెళ్తున్నప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అందులో అతడు టోల్ ప్లాజా వద్ద కారు ముందు సీటులో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది.
అమృత్‌పాల్ కోసం శనివారం రోజు కూడా పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్ వాహనాన్ని అమృత్‌పాల్ అక్కడే వదిలేశాడు. తర్వాత బ్రెజా కారులోకి మారాడు. ఇప్పుడు జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద అతడు బ్రెజా కారులోని కనిపించాడు. బ్రెజాలోనే అతడు తన దుస్తులు కూడా మార్చుకున్నట్లు సమాచారం. అమృత్‌పాల్ పారిపోయేందుకు సహకరించిన అతడి అనుచరుల్లో దాదాపు 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.