పంజాబ్ పోలీసులను గత కొన్నిరోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మరో వీడియోను విడుదల చేశాడు. తాను పోలీసులకు లొంగిపోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోనున్నట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు గురువారం మరో వీడియో విడుదల చేశాడు.
‘‘నేను పారిపోయానని, అనుచరులను విడిచిపెట్టానని కొందరు అనుకుంటున్నారు. ఆ భ్రమను తొలగించుకోండి. నేను చావుకు భయపడను. నేను దేశం విడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేనొక తిరుగుబాటుదారును. తిరుగుబాటు సమయంలో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తిరుగుబాటు అనేది కష్ట సమయం. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. నేను ప్రభుత్వానికి భయపడను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని అమృత్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలని సూచించాడు. సిక్కుల సమస్యల పరిష్కారం కోసం ‘సర్‌బత్ ఖల్సా’ను ఏర్పాటు చేయాలని అకల్ తఖ్త్ జతేదార్‌ను కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.