భద్రాద్రి రామయ్య కల్యాణం రంగరంగ వైభవంగా సాగింది. మిథిలా ప్రాంగణంలో వేలాది భక్తులు పారవశ్యంలో మునిగి తేలగా.. అభిజిత్ లగ్నంలో సీతారాములు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక మరుసటి ఘట్టమైన సీతారాముల సామ్రాజ్య పట్టాభిషేకానికి ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాచలంలో వైభవంగా జరుగుతున్న శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో నేడు రామయ్యకు పట్టాభిషేకం జరగనుంది. మిథిలా ప్రాంగణంలో జరగనున్న సీతారాములకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ హాజరుకానున్నారు.
రామయ్య పట్టాభిషేకాన్ని వీక్షించేందుకు గవర్నర్ తమిళిసై భద్రాద్రికి వెళ్లారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి భద్రాచలానికి బయలుదేరారు. గవర్నర్ తమిళిసై వెంట రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. శ్రీరాముడి పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గత ఏడాది కూడా గవర్నర్ రైలులోనే వెళ్లారు. ఇవాళ ఉదయం భద్రాద్రికి చేరుకున్న గవర్నర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.