హైకోర్టు చేతులెత్తేసిన మరుక్షణమే అందరికి అర్థమయిపోయింది. ఈ సమ్మెకు బేషరతు విరమణ తప్ప వేరే మార్గం లేదని. 45 రోజుల కష్టకాలపు సమ్మె నిష్ఫలంగా ముగిసిపోవలసిందేనని. ఇక్కడ గెలిచిందెవరు? ఓడిందెవరు?
టీఎస్‌ఆర్టీసీ కార్మికులలందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఎట్టకేలకు జేఏసీ ప్రకటించింది, 45రోజులపాటు కొనఊపిరితో కొనసాగిన సమ్మె, అర్థంతరంగా, నిష్ప్రయోజనంగా ఆగిపోయింది. అందుకున్న ఫలితం మాత్రం ఆత్మహత్యలు, ఆకలికేకలు. ఇక కార్మిక కోర్టు కూడా తేల్చేదేమీలేదు. సమ్మె చట్టవిరుద్ధమని అది కూడా ప్రకటిస్తే, అర్టీసీ సమ్మె సంపూర్ణమయిపోతుంది. ‘మనలోకం’ ముందే చెప్పినట్లు సమ్మె బేషరతు విరమణకే మొగ్గుచూపింది.
49వేల ఆర్టీసీ కార్మికులలో ప్రతి ఒక్కరి బ్రతుకు ఇప్పుడు కేసీఆర్ దయాదాక్ష్యిణ్యాలపై ఆధారపడిఉంది. కేవలం కేసీఆర్ మాత్రమే. ఇక్కడ గెలిచింది కేసీఆర్, గెలిపించింది ఆశ్వథ్థామరెడ్డి. ఓడిపోయింది మాత్రం కార్మికులు. ఉద్యమ రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు, కార్మిక రాజకీయాల మధ్య పోలికలు, తేడాలేంటో కేసీఆర్ చెప్పకనే చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, ఆర్టీసీ సమ్మెకు పోలిక తెచ్చిన వారందరికి రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించారు. ఈ పోరాటం జరిగింది సీఎంకు, యూనియన్ నాయకులకు మధ్యనే. ఇప్పుడు నిస్సందేహంగా విజేత కేసీఆర్. ఒక్క ఆర్టీసీకే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ఉద్యోగ సంఘాలకు కూడా ఇదో హెచ్చరికగా, స్పష్టమైన సందేశం పంపగలిగారు. టీజీఓలు, ఎన్‌జీఓలు కూడా వణికే పరిస్థితి ఏర్పడింది.
ఈ విరమణ ఎప్పుడో జరిగుండాల్సింది. ముఖ్యమంత్రి రెండుసార్లు విధులకు హాజరు కమ్మని ఆహ్వానించినప్పుడే వెళితే బాగుండేది. కనీసం కొన్ని ప్రాణాలనయినా కాపాడుకునేవాళ్లు. అశ్వథ్థామరెడ్డి తననుతాను ఎక్కువగా ఊహించుకుని, మరో కేసీఆర్‌లా ఫీలయి, కార్మికుల జీవితాలను ఫణంగా పెట్టాడు. సమ్మెకు ముందు ఉన్న సాధారణ పరిస్థితి ఇప్పుడు ఉండే అవకాశం ఎంతమాత్రం లేదు. విరమణ ప్రకటన సందర్భంగా అశ్వథ్థామ, కార్మికులు సంతకాలు పెట్టరని, ఇంతకుముందులాగే డ్యూటీలకు వెళతారని, అలాగే ఆహ్వానించాలని అన్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే ప్రశ్నేలేదు. ఇప్పుడిక బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఇప్పట్లో కేసీఆర్ స్పందించే అవకాశాలు కూడా చాలా తక్కువ. లేబర్ కోర్టువ్యవహారాన్ని చూపించి ఆయన మరికొంతకాలం దీన్ని సాగదీస్తారు. ఇక పండు పక్వానికి వచ్చిందని అర్థమయ్యాక, అప్పుడు బేరం పెడ్తారు. తనకు కావాల్సిన షరతులు పెట్టి, సంతాకాలు పెట్టినవారినే విధులకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానిస్తారు. వాటిలో అతిముఖ్యమైనవి, ఎటువంటి యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనని రాసివ్వడం. సమ్మెకాలానికి జీతం అడగకపోవడం. మిగతావేవైనా ఉన్నా, అవేమంత పరిగణించదగ్గవి కాకపోవచ్చు. ఇంకో ముఖ్యవిషయం. విఆర్‌ఎస్ ప్రతిపాదన కూడా తప్పనిసరి అయ్యేటట్టువుంది. ఎందుకంటే, రూట్ల ప్రయివేటీకరణపై ఆయన వెనక్కి తగ్గరు. 5100 రూట్లు ఖచ్చితంగా ప్రైవేటుకే ఇస్తారు. అప్పుడు ఇంత మానవశక్తి ఆర్టీసీకి అవసరం లేదు. సగానికి పైగా సిబ్బందిని తగ్గించే దిశగా సీఎం ఆలోచించే ఆస్కారం ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, తిన్న ఎదురుదెబ్బలు ఆయనను రాటుదేల్చాయి. ఏ ఉద్యమానికి మద్దతుంది, దేనికి లేదు, ప్రజలంతా ఎటువైపు ఉన్నారనేదానిపై కేసీఆర్‌కు ఖచ్చితమైన అవగాహన ఉంది. అసలు యూనియన్లలో ఏం జరుగుతోందో కూడా ఆయనకు బాగా తెలుసు. తాను సృష్టించిన అశ్వథ్థామ తనపై కాలుదువ్వడం, స్థాయిని మరిచి నీచమైన వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ ఆగ్రహానికి కారణమయింది. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, లేకపోతే ఎమ్మెల్సీ అయినా ఇవ్వాల్సిందేనని, ఎంత సముదాయించినా వినని అశ్వథ్థామ చివరికి ఏకాకిగా మిగిలిపోయాడు. కనీస సానుభూతికి కూడ అర్హత లేకుండా పోయాడు.
తన స్వార్థం కోసం సమ్మె మొదలుపెట్టిన అశ్వథ్థామ, కేసీఆర్‌ను తక్కువగా అంచనావేసి, తను కూడా ఆయనతో సమానమేనని భావించి తను తీసిన గొయ్యిలో ఇప్పుడు తానే పడ్డాడు.. అప్పుడే ఎన్‌ఎంయూ నేతలు, జేఏసీ1 నేత హన్మంతు అశ్వథ్థామపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇంత నష్టాన్ని జరుగనిచ్చి, ఇప్పుడు అర్థంతరంగా సమ్మె విరమించడంపై కార్మికుల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 45రోజుల పాటు పట్టువదలకుండా ఉన్న సీఎం, ఇప్పుడు ఇంకెంత కఠినంగా ఉంటారోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతోంది. ‘‘అసలు సమ్మెకెందుకు వెళ్లాంరా.. భగవంతుడా..!‘‘ అనుకునే గతికి తీసుకొస్తాడేమోనని వణికిపోతున్నారు. గురువారం సాయంత్రం జరుగనున్న సమీక్షాసమేశంలో అధికారులు, మంత్రులతో మంతనాల అనంతరం ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనా, కార్మికులను విధుల్లోకి తీసుకోవడం విషయంలో ముఖ్యమంత్రి ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుంది. నాయకులు చేసిన తప్పులకు సిబ్బందిని శిక్షించడం భావ్యం అనిపించుకోదు. దైవభక్తి, బహుజనప్రీతి మెండుగా ఉన్న కేసీఆర్ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోరని ఆశిద్దాం.
- రుద్రప్రతాప్