వింత మనిషి.. పిల్లల శవాల్ని దాచుకుని ఇంటికి డెకరేషన్ చేసుకునేవాడట

-

మానవత్వం లేని మనుషులు గురించి మనం కొన్ని వార్తలు విని ఉంటాం..కానీ ఇది అన్నింటికంటే..కాస్త భిన్నమే..అత్యంత దారుణం. మూములు కథ కాదు..ఇలాంటి వ్యక్తులు ఉంటారా అనిపిస్తుంది మీకు. పిల్లల శవాలతో ఇంటికి డెకరేషన్ చేసుకోవడం ఏంటండి..అసలు మనిషేనా అతను అనిపిస్తుంది మీకు..ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అతని పేరు అనటోలీ మాస్క్‌విన్ (Anatoly Moskvin). వయసు 55 ఏళ్లు. రష్యాకి చెందిన చరిత్రకారుడు. యూరప్ చరిత్రపై అతనికి మంచి పట్టుంది. అక్కడి నిజ్నీ నావ్గోరోడ్ నగరంలో నివసించేవాడు. 2011 నవంబర్‌లో ప్రపంచం ఆశ్చర్యపోయే విషయం అతని నుంచి తెలిసింది. మూడేళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల పూడ్చిన శవాల్ని అతను తవ్వి తీశాడని తెలియడంతో.. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు.. అరెస్ట్ చేసిన సమయంలో… అతని ఇంటిని పోలీసులు వీడియో తీశారు. దాన్ని ప్రజలకు రిలీజ్ చేశారు. ఆ ఇంట్లో షెల్ఫులపై, సోఫాలపై పిల్లల శవాల మమ్మీలు ఉన్నాయి. ఆ ఇంట్లోని వేర్వేరు గదుల్లో పెద్ద సంఖ్యలో పాఠ్య పుస్తకాలు, పేపర్ల వంటివి ఉన్నాయి.

అసలు ఎలా తెలిసింది?

అనటోలీ ఓ రోజు తన ఇంటి దగ్గర ఆడపిల్లల బొమ్మలా డ్రెస్ వేసుకున్నాడు. ఇంటి చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ నిల్చొని ఉండేవాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్లు… “ఏమైంది ఈయనకి” అని అనుకుంటూ… అనటోలీ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆ టైమ్‌లో హాలిడే ట్రిప్‌లో ఉన్న ముసలి పేరెంట్స్… సడెన్‌గా అనటోలీ ఇంటికి వచ్చారు. లోపల మమ్మీలను చూసి వాళ్లు షాక్ అయ్యారు. ప్రతీ మమ్మీ బొమ్మకూ ఓ నోట్ ఉంచాడు. ఆ బొమ్మ ఏ శవమో అందులో రాశాడు. ఏంటిది అని పేరెంట్స్ అడిగితే… ఓ కథ చెప్పాడు. “నా చిన్నప్పుడు 11 ఏళ్ల బాలిక చనిపోతే… ఎవరో పెద్దాయన బలవంతంగా నాతో… ఆ పాప తలపై ముద్దు పెట్టించారు. అప్పటి నుంచి నాకు శవాలు నచ్చుతున్నాయి” అని చెప్పాడు. షాకైన పేరెంట్స్… పోలీసులకు కాల్ చేశారు.

మొత్తం 26 మమ్మీలు:

150 సమాధులను తవ్వి… వాటిలో 26 పిల్లల శవాల్ని సేకరించి… వాటిని మమ్మీలుగా మార్చి డెకరేట్ చేసుకున్నాడని పోలీసులు దర్యాప్తులో తెలిసింది. అన్నీ ఆడపిల్లల మమ్మీలే. రష్యా పీనల్ కోడ్ లోని ఆర్టికల్ 244 కింద అతన్ని అరెస్టు చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం సమాధులను తవ్వడం, పూడ్చిన శవాల్ని బయటకు తియ్యడం నేరం. దీని ప్రకారం అతనికి గరిష్టంగా ఐదేళ్ల శిక్ష పడుతుంది. అదే పడి ఉంటే… అతను 2016లో రిలీజ్ అయ్యేవాడే. కానీ… పోలీసులు అరెస్టు చేసిన సమయంలో… అతను తనదైన వాదనను బలంగా వినిపించాడు. దాంతో అతని మానసిక పరిస్థితి బాలేదనీ అతను పారనాయిడ్ స్కిజోఫ్రీనియా (paranoid schizophrenia) సమస్యతో బాధపడుతున్నాడని చెప్పి… అతన్ని సైకియాట్రిక్ క్లినిక్‌కి పంపారు.

అనటోలిని ఇంటర్వ్యూ చేసిన వాళ్లు భయపడ్డారు. నిజానికి అనటోలీ తెలివైన వాడు. శవాల్ని వెలికి తియ్యకముందు… అతను మమ్మిఫికేషన్ ఎలా చేస్తారో స్టడీ చేశాడు. శవాలపై ఉప్పు చల్లి… అవి డ్రై అయ్యేలా చేశాడు. అలా ఎండిన శవాల్ని ఇంట్లో ప్రదర్శనకు ఉంచుకున్నాడు.

కోర్టులో వింత వాదన

కోర్టులో కూడా అనటోలీ తానే కరెక్ట్ అన్నాడు. “నేనేదో చెయ్యరాని నేరం చేసినట్లు ఎందుకు అనుకుంటున్నారు. నా తప్పేమీ లేదు. నా ఇంట్లో పిల్లలు ఉండాలని అనుకున్నా. నాకు పిల్లలు లేరు కాబట్టి ఓ యువతిని దత్తత తీసుకుందామనుకున్నా. కానీ రష్యా చట్టాల ప్రకారం నాకు తగినంత ఆదాయం లేదని అందువల్ల అదీ కుదరలేదు. కాబట్టే శవాల్ని పిల్లల్లా చూసుకుంటున్నాను. నేను ఏ శవంపైనా ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడలేదు. వాళ్లను నా పిల్లలలా చూసుకుంటున్నాను” అని కోర్టులో వితండవాదం చేశాడు. అంతేకాదు..తాను ఆ శవాలతో మాట్లాడతానని, వాళ్ల కోసం పాటలు పాడతానని, వాళ్లతో కలిసి టీవీలో కార్టూన్లు చూస్తానని, వాళ్లకు బర్త్‌డే పార్టీలు కూడా చేస్తున్నాను అని చెప్పడంతో కోర్టులో వారంతా ఆశ్చర్యపోయారు.

ఫైనల్ గా ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

అనటోలీ అరెస్టై 11 ఏళ్లు అయ్యింది. 2012 నుంచి అతనికి మానసిక చికిత్స అందిస్తున్నారు. అతని తరపు లాయర్లు… అతన్ని విడుదల చెయ్యాలని కోరుతున్నారు. అతను ఓ మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని కోర్టుకు తెలిపారు. అనటోలీ మామూలోడు కాదు. అతను 13 భాషలు మాట్లాడగలడట. అందువల్ల అతనితో ఓ పుస్తకాన్ని రాయించి… ఆ తర్వాత అతన్ని లాంగ్వేజ్ టీచర్‌ని చెయ్యాలని లాయర్లు భావిస్తున్నారు. ఇతని రిలీజ్ అంశం ఇప్పుడు కోరు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశం కోసం అతని లాయర్లు ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news