ఎవరెవరు ఊహించారో, ఎందరు ఊహించలేదో తెలియదు కానీ… 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ్ముళ్లు కూడా ఊహించని విధంగా టీడీపీ యువనేత, భవిష్యత్ ఆశాకిరణం, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఘోర ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది! అయితే నాడు లోకేష్ ఎందుకు ఓడిపోయారు.. నేడు తనదైన శైలిలో చెబుతోంది ఆంధ్రజ్యోతి పత్రిక!
బాబుకు వంతపాడే ఎల్లో మీడియా సంస్థలుగా పిలవబడే మీడియాలో ఒకటైన ఆంధ్రజ్యోతి తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. క్లుప్తంగా అందులోని మ్యాటర్ ఏమిటంటే… జగన్ అమరావతిని మార్చనని, మార్చేది లేదని ఎన్నికల సమయంలో చెప్పారు. దాంతో ప్రజలంతా జగన్ మాటలు నమ్మి ఓట్లేశారు. జగన్ అమరావతిని మార్చడన్న విషయాన్ని జనం ఎంతగా నమ్మారంటే… ఆఖరికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిని కూడా ఓడించేంతగా అని! అంటే… అమరావతిని మార్చను అని జగన్ మాటిచ్చినందుకే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడని చెబుతుంది ఆంధ్రజ్యోతి! లేదంటే… చరిత్రలో ఇంతకాలం ఎవ్వరినీ రాని మెజారిటీతో లోకేష్ గెలిచేవారనేది వారి ఉద్దేశ్యం అవ్వొచ్చు!
ఇక్కడ సరిగ్గా గమనించాల్సిందేమిటంటే…. అసలు గడిచిన ఎన్నికల్లో అమరావతిలోనే రాజధాని అనే విషయమే కీలకం.. అమరావతే మేండేట్ అయితే… చినబాబు తోపాటు మిగిలిన టీడీపీ నేతలు.. కనీసం అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గ నేతలు అయినా గెలిచేవారు కదా! అమరావతి ప్లాన్ చేసింది చంద్రబాబు.. అక్కడ భూములు సేకరించింది చంద్రబాబు.. అమరావతిపై ప్రజలకు ఆశలు కల్పించింది చంద్రబాబు.. రైతులకు భవిష్యత్తుపై భ్రమలతో కూడిన భరోసా కల్పించింది చంద్రబాబు.. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా సీనియర్ అనే మాటున సీటెక్కింది చంద్రబాబు.. అలాంటి చంద్రబాబుని కాదని జనం జగన్ ని ఎందుకు నమ్మినట్లు! నమ్మితిరిపో… కేవలం అమరావతి కోసమే లోకేష్ ఓడిపోయారనుకుంటే… అసలు అమరావతే గత ఎన్నికల్లో కీ పాయింట్ అయితే… అందుకు జనం పూర్తిగా నమ్మాల్సింది బాబునే కదా!
అంటే… జనానికి అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహితపాలన ముఖ్యం కానీ… రాజధాని ఎక్కడ ఉంది, సచివాలయం బిల్డింగ్ కి ఏ రంగు వేశారు అన్నది కాదు! ఫలితంగా.. అమరావతికి జగన్ మద్దతు ప్రకటించడంవల్లే… లోకేష్ ఓడిపోయారనే వాదనలో నిజం లేనట్లే! ఎందుకంటే… అమరావతి చుట్టుపక్కల కూడా చంద్రబాబుకు సీట్లు రాలేదు! నిర్మించ తలపెట్టిన బాబుని కాదని.. కేవలం అమరావతి కోసమే అయితే జనం జగన్ ని ఎందుకు గెలిపిస్తారు… సీనియర్ అని, అమరావతి నిర్మాణంపై పూర్తి క్లారిటీ ఉన్న బాబునే గెలిపించేవారు కదా!! ఈ లాజిక్ మిస్సయిన ఆంధ్రజ్యోతి… కేవలం జగన్ అమరావతికి మద్దతు ఇవ్వడం వల్లే… జనం నమ్మి మంగళగిరిలో లోకేష్ ని ఓడించారని చెప్పడానికి మించిన అర్ధరహిత వాదన మరొకటి ఉంటుందా అనేది విశ్లేషకుల మాటగా ఉంది!!