ఎలా అయినా విశాఖకి పరిపాలనా రాజధానిని తరలించాలని చూస్తోన్న ప్రభుత్వానికి మళ్ళీ నిరాశ ఎదురైంది. రాజధాని తరలింపు పిటీషన్ లపై హై కోర్ట్ లో ఈరోజు విచారణ జరగగా సెప్టెంబర్ 21 వరకు రాజధాని అమరావతి పై స్టేటస్ కో ఉత్తర్వులు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక పై స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. 30 ఎకరాల్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది నిదేష్ గుప్తా పేర్కొన్నారు.
గెస్ట్ హౌస్ మాటున ప్రభుత్వం పరిపాలన రాజధాని కోసం నిర్మాణాలు చేపడుతోందని ఆయన వాదించారు. పిటిషనర్ వాదనలు తోసిపుచిన అడ్వాకేట్ జనరల్, వివిఐపిల కోసం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందని అన్నారు. వైజాగ్ లో గెస్ట్ హౌస్ నిర్మాణం పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని సెప్టెంబర్ 10న విచారిస్తామన్న హైకోర్టు, రాజధాని పిటిషన్ల పై సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. అలానే అప్పటి దాకా స్టేటస్ కోని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.