సైబ‌ర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయిన అమ‌లాపురం ఎంపీ.. రూ.2 లక్షలు టోపీ

ఎంపీ అంటే ఆ స్థాయే వేరు. చుట్టూ మందీ మార్బ‌లాలు.. సాధార‌ణ పౌరుడు అప్పాయింట్‌మెంట్ తీసుకుని మాట్లాడాలంటే.. భారీ వెయిటింగ్ ఇలా.. అనే అంచ‌లు చాలానే ఉంటాయి. అసలు ఎంపీగారి ద‌ర్శ‌నం ల‌భించాలంటేనే చాలా క‌ష్టం. అలాంటిది ఓ ఎంపీని మోసం చేయ‌డం అంటే.. సాధ్య‌మేనా? అస‌లు ఎలా మోసం చేయ‌గ‌ల‌రు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే.. అమ‌లాపురం ఎంపీ చింతా అనురాధ‌కు ఎదురైన అనుభవం. ఎస్సీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన అనురాధ‌.. జిల్లాలోని కాకినాడ, రాజ‌మండ్రి ఎంపీల‌తో పోటీ ప‌డుతున్నారు.

అభివృద్ధిలో వారిక‌న్నా.. రెండడుగులు ముందుండాల‌ని అనురాధ క‌ల‌లు కంటున్నారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, ఈ తొంద‌ర‌పాటే.. ఎంపీని నిలువునా మోస‌పోయేలా చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యం ఏంటంటే.. కేంద్రం ఎంపీలాడ్స్ కింద ఎంపీల‌కు నిధులు విడుద‌ల చేస్తుంది. ఈ విష‌యం తెలిసిందే. అయితే, ఓ ఫైన్ మార్నింగ్ అనురాధ ఫోన్‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. మేడం మీరు కొంత ఎమౌంట్ పంపిస్తే.. మీకు రావాల్సిన కేంద్ర నిధుల‌ను మీ ఎకౌంట్‌లో జ‌మ‌చేస్తాం!-అని. దీంతో వెనుకా ముందు ఆలోచించ‌కుండానే అనురాధ రెండు ల‌క్ష‌లు పంపేశారు.

అయితే, ఎన్ని రోజులు గ‌డిచినా కూడా ఈ విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు. త‌న‌కు కేంద్రం నుంచి నిధులు రావ‌డం అటుంచితే.. త‌ను పంపిన 2 ల‌క్షల రూపాయ‌ల ప‌రిస్థితి త‌లుచుకుని ఎవ‌రికీ చెప్ప‌లేక ఎంపీ ఇబ్బంది ప‌డ్డారు. ఇలా సైబ‌ర్ నేర‌గాడి వ‌ల‌లో చిక్కిన అనురాధ ఉదంతం..ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు తెలిసింది. దీంతో వారు ర‌హ‌స్యంగా విచారించి స‌ద‌రు వ్య‌క్తి ఇదే జిల్లాకు చెందిన వాడిగా గుర్తించి అరెస్టు చేశారు. చింత అనురాధ‌ను మోసం చేసిన త‌ర్వాత ఈ నేర‌గాడు.. మ‌రో 30 మందిని మోసం చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఏదేమైనా.. ఓ ఎంపీ స్థాయి నేత ఇలా సైబ‌ర్ నేర‌గాడికి చిక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదేస‌మ‌యంలో సైబ‌ర్ నేరాల తీవ్ర‌త‌ను కూడా స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.