పూర్తిగా నిండిపోయిన శ్రీశైలం డ్యాం.. 10 గేట్లు ఎత్తివేత..!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పైనున్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరద చేరుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 2,96,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయం వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం నమోదవుతున్న నేపథ్యంలో 10 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,22,625 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,11,586 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. దీంతో మొత్తం 3,11,586 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నట్లయింది.

అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 885 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. అలాగే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.