ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలకు ప్రధాని అడ్వైజరీ కౌన్సిల్ ఫిదా అయింది. 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు విద్యారంగాన్ని ప్రధాన రంగంగా ఎంపిక చేసి అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఆ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశంలో కనీవినీ ఎరుగని రితీలో పథకాలను ప్రవేశపెట్టిన అగ్ర పథాన నిలిపారు.తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఈ మేరకు నివేదికలు విడుదల చేశారు.
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.ఫౌండేషన్ కోర్సుల్లో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి అని పేర్కొన్నారు.
దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి.పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణితంపై నైపుణ్యాలు పెంచడం వంటి అంశాలను ఈ నివేదిక పరిశీలనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మరియు అంశాల వారీగా స్కోరును ఇచ్చారు.
ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలపై ఇప్పుడు పొరుగు రాష్ర్టాలు సైతం అధ్యయనం చేసేందుకు సిద్ధం అయ్యాయి. సీఎం జగన్ అధికారంలోనే ఉంటే భవిష్యత్తులో విద్యారంగంలో ఏపీ అగ్రపథాన కొనసాగుతుందని పలువురు మేధావులు చెప్తున్నారు.