ప్రభుత్వ శాఖల ప్రభుత్వ వెబ్ సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగు దేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదని పేర్కొన్నారు. నేటికీ వాటిలో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిని తొలగించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.