వైసీపీలో అంబ‌టి చుట్టూ అస‌మ్మ‌తి సెగ‌లు..!

-

ఏపీలో అధికార వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించే నేతల్లో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచి… మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత సత్తెనపల్లిలో వైసీపీ నుంచి విజయం సాధించి అసెంబ్లీ గడప తొక్కారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు… పార్టీ సీనియర్ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే అంబ‌టికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తీవ్రమైన అసమ్మతి వెంటాడుతోంది.

2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అంబ‌టి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియ‌ర్‌ నేత కావడంతో ఖ‌చ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే అంబటి ఒక్కోసారి అతి చేస్తారన్న టాక్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుండటంతో జగన్ ఆయనను పక్కన పెట్టేశారు. కాపు సామాజిక వర్గానికి తన క్యాబినెట్ లో అంబ‌టి కన్నా జూనియర్ నేతలకు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

చివ‌ర‌కు గత ఎన్నికలకు ముందు పార్టీ మారి వచ్చిన అవంతి శ్రీనివాస్ ఇలాంటి నేతలకు మంత్రి పదవి ఇచ్చినా అంబ‌టిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టారు. రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ మార్పులు చేర్పుల్లో అయినా మంత్రి పదవి వస్తుందని అంబటి ఎన్నో ఆశలతో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే మరో ఏడాది తర్వాత జరిగే విస్తరణలో కూడా అంబ‌టికి మంత్రి పదవి లభించే అవకాశాలు లేవు. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన జగన్‌కు లేదని తెలుస్తోంది.

ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి జగన్ మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. ఇక హోం మంత్రి మేకతోటి సుచరితను మార్చే అవకాశాలు లేవు.  ఇదిలా ఉంటే స్థానికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోనే అంబ‌టిని వ్యతిరేకించే వర్గం రోజురోజుకీ బలపడుతోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఆయ‌న్ను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తున్నాయి. ఇక సొంత పార్టీ నేతలే అంబ‌టికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు అంటే ఆయన పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అంబటికి టిక్కెట్ ఇస్తే తాము సహకరించమని కొన్ని బలమైన వర్గాలు ఓపెన్‌నే చెబుతున్నాయి. ఇక అంబటి అనుచరుల అవినీతి అక్రమాలపై సైతం సామాన్య ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఏదేమైనా అంబటి దూకుడు చర్యలతో పాటు అనాలోచిత నిర్ణయాల వల్లే రాజకీయంగా ఆయన ఇబ్బందుల్లో పడినట్టు క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది.

 

– vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Latest news