వినియోగదారులకు షాక్.. మరోసారి అమూల్ పాల ధరల పెంపు

వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది అమూల్ సంస్థ. అమూల్‌ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌’ గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ (సేల్స్‌) ప్రకాశ్‌ ఆటే తెలిపారు. లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచినట్లు ఎండీ జయేన్‌ మెహతా శుక్రవారం వెల్లడించారు.

తాజా పెంపుతో లీటర్‌ పాల ధరలు ఇలా ఉన్నాయి..

అమూల్‌ తాజా- రూ.54

అమూల్‌ గోల్డ్‌- రూ.66

అమూల్‌ ఆవు పాలు- రూ.56

అమూల్‌ ఏ2 గేదె పాలు- రూ.70

పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది. ఒక్క పశువుల దాణా ధరలే 20 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. గత ఏడాది ఆగస్టు, అక్టోబరులోనూ అమూల్‌ లీటర్‌ పాలపై రూ.2 చొప్పున ధరల్ని పెంచింది.