ఏపీలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా మరో బులిటెన్ విడుదల చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీనివల్ల నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఇటీవల కురిసిన వర్షాలతో బెజవాడ నగరం ఇంకా తేరుకోనేలేదు.
నాలుగు రోజులుగా నీటిలోనే ఉన్న అనేక కాలనీవాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఏపీతోపాటు తెలంగాణకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. కొమరం భీమాసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.