ఔను! ఇప్పుడు మీడియా వర్గాల్లోనే కాదు.. పత్రికలు చదివే.. బుద్ధి జీవులు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎవరినో కాదు.. ఎల్లో మీడియానే! ఒక్కసారి మనం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు అన్న విషయం తెలిసిందే కదా. ఈ సమయంలో జాతీయ మీడియా ఆయనను తిట్టిపోసింది. అరరే బంగారు బాతు లాంటి అమరావతిని వద్దంటావేంటి ? అంటూ.. పెద్ద పెద్ద వార్తలు అచ్చోసింది. దీంతో ఇక్కడి ఎల్లో మీడియా తాను నిత్యం జగన్‌పై చేస్తున్న విమర్శలు.. తిడుతున్న తిట్లు చాలవన్నట్టు ఆయా జాతీయ ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో వచ్చిన కథనాలను కూడా తెలుగులోకి తర్జుమా చేశాయి.
ఆయా కథనాల ఫొటోలను పేర్చి.. పేజీలకు పేజీలు.. ఈ మీడియా ఇలా తిట్టింది.. ఆ మీడియా అలా దుమ్మెత్తి పోసింది. అయినా జగన్‌కు బుద్దిరావట్లేదు. మేమంటే.. ఎల్లో మీడియా అని కొట్టిపారేయొచ్చు. కానీ, జాతీయ మీడియానే ఇప్పుడు తిడుతోంది. సో..ఇదీ జగన్ బాగోతం.. అంటూ అచ్చోశారు. కట్ చేస్తే. ఇప్పుడు అదే జాతీయ మీడియా జగన్‌ను అంబరానికి ఎత్తేస్తోంది. ఇండియాటుడే సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారట. ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానంగా మారిందని సదరు మీడియా పేర్కొంది. అంతేకాదు, సంక్షేమం-అభివృద్ధితో సీఎం జగన్ దూసుకెళ్తున్నారన్నారని కూడా మీడియా ప్రశంసలు కురిపించింది.
ఇంకో మాట కూడా చెప్పింది ఇండియాటుడే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు కూడా ఓడిపోతారని కూడా పేర్కొంది. కొన్నాళ్ల కిందట సీ-ఓటర్ అనే సంస్థ కూడా దేశవ్యాప్తంగా సీఎంల పనితీరుపై ఓ సర్వేను ప్రచురించింది. అందులో కూడా సీఎం జగన్‌కు నాలుగో స్థానం వచ్చింది. అతిరథ మహారథులైన సీఎంల సరసన చేర్చింది. మరి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవే కటింగ్స్‌తో ఈ ఎల్లో మీడియా తన పత్రికల్లో ప్రచురించే సాహసం చేయగలదా ? మేం ఎలాగూ తిడుతూనే ఉన్నాం..కనీసం జాతీయ మీడియా అయినా.. జగన్‌ను గుర్తించిందని అనుకోలగలరా ? అనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్న. కానీ, ఒక్కనాటికి దీనిని ఒప్పుకోరు కదా?! ఒప్పుకొంటే.. ఎల్లో మీడియా ఎందుకు అవుతుంది..!