స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది. ఈనెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే విచారణను ఈనెల 19వ తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై ఈనెల 18వ తేదీ వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారంలో ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని, తనపై ఏసీబీ కోర్టు జరుపుతున్న విచారణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని క్వాష్ పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.
ఇంకోవైపు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.