విజయవాడలోని ఇద్దరకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయ ఈవోకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని న్యాయస్థానం ఆ నోటీసులలో ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు అమలు చేయనందుకు కోర్టుకు రావాలని ఆదేశించింది. ఈనెల 8న హైకోర్టుకు హాజరుకావాలని ఈవో భ్రమరాంబకు నోటీసులు జారీ చేసింది.
రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపినప్పటికీ ఈవో స్పందించకపోవడంతో ధిక్కరణ కేసులో భాగంగా ఈవో భ్రమరాంబ కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.