విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోతే మీరు జైలుకే : ఏపీ హైకోర్టు

-

ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% సీట్లను ఉచితంగా కేటాయించి, భర్తీ చేయడంలో ప్రభుత్వ తీరు సరిగాలేదని ఏపీ హైకోర్టు ఎండగట్టింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2022-23) ఈ సీట్లను ఇవ్వాలంటూ తామిచ్చిన ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడింది.

పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీసింది. మాటలు కాదు.. చేతల్లో చూపాలని ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి భర్తీ చేసినట్లు రుజువులు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు.. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను హెచ్చరించింది. విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదంటే అధికారులు జైల్లో అయినా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎంతమంది పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారన్న వివరాలను కోర్టు ముందుంచాలని తేల్చిచెప్పింది. ఆ వివరాలపై సంతృప్తి చెందకపోతే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని స్పష్టంచేసింది. వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news