మరోసారి కేంద్ర ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక సమస్యలను పరిష్కరించాలని .. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు.. జగన్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. అయి తే, ఇప్పటి వరకు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది లేదు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే జనాభా ప్రాతిపదికన నిధు లు మంజూరు చేసింది తప్ప.. విభజన నాటి హామీలను ఇప్పటి వరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాకారం చేసే దిశగా అడుగులు వేసింది లేదు. అయినా కూడా జగన్ సర్కారు కేంద్రాన్ని “ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్“ అంటూ బతిమాలుతూనే ఉంది. తాజాగా మరోసారి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. జగన్ మనసులో మాటను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలన్నది జగన్ సర్కారు విన్నపం. అదేవిధంగా రాష్ట్రానికి చేయూత ఇచ్చేం దుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సమయం నుంచి కూడా జగన్ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్ చేయాల్సి ఉంది.
పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చుపెట్టి రీయంబర్స్‌మెంట్ అడుగుతున్న విషయం తెలిసిందే. జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సి ఉంది. ఇక, ఏప్రిల్, మే, జూన్ లో రాష్ట్రానికి 40 శాతం ఆదాయం పడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను ఎక్కడా వాయిదా వేయకపోవడం గమనార్హం. అదేసమయంలో పోలవరం పనులను కూడా వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో వాటిని కూడా పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. ఇక, గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం మేరకు ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజీగా మార్చుకున్నా.. దానిలోనూ స్పష్టత లేక పోవడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి నిధుల సమీకరణకు జగన్ ప్రభుత్వం చేస్తున్న రాయబారం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఇప్పటికైతే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ రాయబారం.. బుగ్గన వివరణలు ఫలిస్తాయో.. వికటిస్తాయో.. చూడాలి.