`అన్నా మన పాలనపై జనం ఏమనుకుంటున్నారు?` మంత్రి బొత్స సత్యనారాయణను ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ అడిగిన ప్రశ్న ఇది. ప్రదాన మీడియాలో రాకపోయినా.. మంత్రుల మధ్య జరిగిన సంభాషణలను బట్టి సోషల్ మీడియాలో ఆఫ్ దిరికార్డుగా వైరల్ అయింది. సీఎం ప్రశ్నకు మంత్రిగా బొత్స చెప్పే సమాధానం అందరూ ఊహించేదే. అయితే, నిజంగానే ఏ ముఖ్యమంత్రికైనా.. తన పాలనపై ఉత్సుకత ఉంటుంది. పైగా తొలిసారి అధికార పగ్గాలు చేపట్టిన సీఎంగా జగన్‌కు మరింత ఆరాటం ఉంటుందనడంలో సందేహం లేదు. అనేక పథకాలు, అనేకానేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. ఆయనపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజల టాక్ ఎలా ఉందనే విషయంపై ఒకింత ఉత్సుకత సాధారణంగానే నెలకొంది.
ఇదే విషయంపై కేబినెట్ బేటీ అనంతరం మంత్రుల మధ్య చర్చ కూడా సాగింది. ఈ విషయంలో కొందరు మంత్రులు తటస్థంగా వ్యాఖ్యానిస్తే.. మరికొందరు మాత్రం ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ప్రజలు పాజిటివ్ కోణంలో తీసుకుంటున్నారని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు వ్యాఖ్యానించారు. ఇక, సీమకు చెందిన మంత్రులు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మాకు క్లీన్ చిట్ ఇస్తున్నారు. విమర్శలు చేసేవారిని చేసుకోమనే చెబుతున్నాం. మీరు ఎన్ని రాసినా.. వారు ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలు మావైపే ఉన్నారు.. అని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రి మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక, ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం తన చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆఫ్ దిరికార్డుగా మాట్టాడుతూ.. మా నాయకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలపై చర్చ సాగుతోంది. ఆయనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఆయన మాటలను అప్పట్లో కూడా ప్రజలు పట్టించుకోలేదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ విషయంలో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అందుతున్న సంక్షేమ ఫలాలపై వారే లెక్కలు తీసుకుంటున్నారు.
ఇలాంటి చర్చే మాకు కావాలని సీఎం కూడా చెబుతున్నారు. మేమేదో.. గణాంకాలు తీసేసి.. సర్వేలు చేసేసి.. ప్రజలంతా మావైపే ఉన్నారని మేం చెప్పం. ప్రజలు ఉన్నారో లేదో .. వారే చెబుతారు! అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి జగన్ సర్కారుపై జనం మాటల విషయంలో మంత్రులు క్లారిటీగానే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.
-vuyyuru subhash