ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం అందునా.. పెద్దన్నగా కేంద్రమే రంగంలోకి ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం దీనికి ముహూర్తం ఖరారైంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తును పెంచడం ద్వారా.. ఏపీలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని నిర్ణయించుకున్న జగన్ సర్కారుపై తెలంగాణ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ సర్కారు కూడా.. ఇప్పుడు ఎంత వరకైనా పోరాడేందుకు రెడీ అని ప్రకటించింది.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్తితిలోనూ తెలంగాణ దూకుడును తట్టుకునే పరిస్థితి లేదని.. ఖచ్చితంగా ఎదిరించి తీరాలని నిర్ణయించుకుంది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల సహా మరికొన్ని ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని, వీటిని అడ్డుకుని తీరాలని కూడా జగన్ సర్కారు గట్టిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఇప్పటికే కృష్ణాజలాల వినియోగంపై కేఆర్ ఎంబీ సహా ఇంజనీర్ల స్థాయిలో చర్చలు ముగిసినా.. ఎలాంటి నిర్ణయం కొలిక్కిరాలేదు.
ఇక, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రులతోనే ఈ విషయాన్ని చర్చించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి త్వ శాఖ కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమావేశం అనేక వాయిదాల తర్వాత మంగళవారం నిర్వహించనున్నారు. అయి తే, ఇది కేవలం.. జల వివాదానికే పరిమితయ్యేలా కనిపించడం లేదు. రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకోనుంది. ముఖ్యంగా కేంద్రంతో తెలంగాణ సర్కారు చాలా విషయాల్లో విభేదిస్తోంది. వ్యవసాయ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై కూడా ఆగ్రహంతో ఉంది.
రుణ పరిమితిని.. కూడా పెంచకపోవడం, కేంద్రం పెట్టిన నిబంధనలకు ఆగ్రహంతో ఉండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. అదే సమయంలో ఏపీ అన్ని విషయాల్లోనూ సహకరిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఏపీకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని.. తెలంగాణలో చర్చకు వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఈ అపెక్స్ కమిటీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
-Vuyyuru Subhash