కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం అవనిగడ్డ. ఇక్కడ టీడీపీకి మంచి పట్టుంది. వ్యక్తులు ఎవరైనా సరే.. ఇక్కడ బలమైన ఓటు బ్యాంకును పార్టీ సొంతం చేసుకుంది. వ్యక్తులతో సంబంధం లేకుండా పార్టీని గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి నియోజకవర్గంలో గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. సీనియర్ రాజకీయ నేత సింహాద్రి సత్యనారాయణ రావుకు బంధువుగా రాజకీయ రంగంలోకి వచ్చిన సింహాద్రి రమేష్‌బాబు ఇక్కడ నుంచి విజయం సాధించారు. అది కూడా మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్‌ను ఓడించారు. ఇది గత ఏడాది ఎన్నికల్లో జిల్లాలోనే అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గంగా నిలిచింది.
ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏడు సార్లు విజయం సాధించింది. దీనిలో మూడు సార్లు సింహాద్రి సత్యనారా యణరావు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి వచ్చిటీడీపీ తీర్థం పుచ్చుకున్న మండలి కూడా విజయం సాధించారు. గతంలో ఈయన కాంగ్రెస్ తరఫున కూడా ఇక్కడ విజయం సాధించారు. అలాంటి చోట.. గత ఏడాది సింహాద్రి రమేష్‌బాబు.. వైసీపీ జెండాను రెపరెపలాడించి రికార్డు సృష్టించారు. అయితే, ఇప్పుడు ఏడాది ముగిసినప్పటికీ.. ఆయన ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయాలు చేయడం లేదు. నిజానికి ఈ ఏడాది కాలంలో సింహాద్రికి అద్భుతమైన అవకాశం వచ్చింది. అదేంటంటే.. మండలి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని దాదాపు వదిలి పెట్టేశారు.
పైగా మండలి హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. పార్టీ తరఫున కూడా ఎలాంటి గళం వినిపించడం లేదు. ఈ సమయంలో టీడీపీకి బలమైన కోటరీ ఉన్న ఈ నియోజకవర్గంలో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించి తనకు సానుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకునేందుకు సింహాద్రికి అవకాశం దక్కింది. అయితే, దీనిని ఆయన కూడా వినియోగించుకోవడం మానేశారు. ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేరు కాబట్టి.. తనను అడిగేవారు ఎవరూ లేరనే ధోరణిలో ఉన్నారనే వ్యాఖ్యలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఎవరైనా వచ్చి పనులు చేయాలని అడిగితే.. ప్లీజ్ వెయిట్ అనే మాట తప్ప.. ఆయన నుంచి ఏమీ వినిపించడం లేదని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ కంచుకోటలో గెలిచాననే ఒక్క ఆనందం తప్ప.. భవిష్యత్తులో పునాదులు ఎలా పదిలం చేసుకోవాలని వ్యూహం మాత్రం కనిపించడం లేదని రమేష్ అనుచరులే చెబుతుండడం గమనార్హం.