ఏపీలో మరో టీడీపీ అరెస్ట్ అయ్యారు..సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారు జామున సిఐడి పోలీసులు…నర్సీపట్నంలో అయ్యన్న ఇంటికొచ్చి..ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంటిగోడ కూల్చివేత వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. దీంతో సీఐడీ పోలీసులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేసి..అతనితో పాటు అతని కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అయ్యనపై కేసు నమోదు చేయగా, ఆయన్ని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
అయితే వైసీపీలో అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి టీడీపీ నేతలపై పలు కేసులు, అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ళ నరేంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీటెక్ రవి, ప్రవీణ్ కుమార్ రెడ్డి..ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది. ఇలా టీడీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవ్వడం, మళ్ళీ వెంటనే బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి. ఇక వారి కేసులు ఏమయ్యాయో ఏ మాత్రం క్లారిటీ లేకుండా పోయాయి. ఇప్పుడు అయ్యన్న వంతు వచ్చింది. ఇప్పటికే అయ్యన్న మరో తనయుడు చింతకాయల విజయ్‌కు..సిఐడి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వైస్ భారతిపై అనుచిత పోస్టులు పెట్టారని విజయ్‌కు నోటీసులు ఇచ్చారు.
ఇక అక్రమ గోడ కూల్చివేత విషయంలో అయ్యన్న నకిలీ పత్రాలు ఇచ్చారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. యథావిధిగానే అయ్యన్న అరెస్ట్‌పై చంద్రబాబుతో సహ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అయ్యన్నకు అండగా నిలబడ్డారు. జగన్ రాక్షసుడు అంటూ బాబు ఫైర్ అయ్యారు. తప్పు చేశారు కాబట్టే అయ్యన్న అరెస్ట్ అయ్యారని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. మొత్తానికి జగన్‌పై నిత్యం ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అయ్యన్న అరెస్ట్ అంశం పెద్ద హాట్ టాపిక్ అయింది.