విజయవాడ ప్రజలకు భారీ ఊరట. అమావాస్య గండం నుంచి గట్టెక్కుతోంది బెజవాడ నగరం. అమావాస్య ముగిసిన తరుణంలో వేగంగానే సముద్రంలోకి చేరుతోంది వరద నీరు. దీంతో ప్రకాశం బ్యారేజీకీ వేగంగా తగ్గుతోంది వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. 11.43 లక్షల నుంచి గంట గంటకు తగ్గుతూ 8.94 లక్షల క్యూసెక్కులకు చేరింది వరద.
18 గంటల్లో రెండున్నర లక్షల వరద తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రానికి వరద మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక అటు ప్రకాశం బ్యారేజీ కి ఎలాంటి ముప్పు లేదన్నారు కన్నయ్య నాయుడు. అన్ని గేట్లు బాగా ఉన్నాయి..మూడు బోట్లు నేరుగా బ్యారేజీని ఢీకొట్టడం వల్ల కౌంటర్ వెయిట్ డామేజ్ అయిందని తెలిపారు. 15 రోజుల్లో కొత్త కౌంటర్ వెయిట్ దిమ్మెను ఏర్పాటు చేస్తామని తెలిపారు కన్నయ్య నాయుడు. 20 ఏళ్ల క్రితం ప్రకాశం బ్యారేజ్ కి నేనే గేట్లు నిర్మించానన్నారు.