ఏపీలో త్వరలోనే ఉప ఎన్నిక తప్పేలా లేదు. వాస్తవానికి టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామా చేస్తేనో ? లేదా వైసీపీ అసంతృప్తి ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేస్తేనో ఉప ఎన్నిక వస్తుందని అనుకున్నాం. అయితే వైసీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు ఓటములు ఎలా ? ఉన్నా కూడా టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు తమ బలం ఎంతో నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఆరు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక కంప్లీట్ కావాలి. ఇప్పటికే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. బిహార్ ఉప ఎన్నికలతో పాటు దుబ్బాకకు ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటు తిరుపతి లోక్‌సభ సీటుకు కూడా ఉప ఎన్నిక జరగవచ్చు. వాస్తవానికి సిట్టింగ్ క్యాండెట్ చనిపోతే అక్కడ ఉప ఎన్నికల్లో మిగిలిన పార్టీలు పోటీ పెట్టడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇది బ్రేక్ అవుతోంది. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోతే వైసీపీ పోటీ పెట్టలేదు. కాంగ్రెస్ పోటీలో ఉండడంతో టీడీపీ లక్ష మెజార్టీతో గెలిచింది.
ఇక నంద్యాలలో భూమా నాగిరెడ్డి చనిపోతే అది తమ పార్టీ సిట్టింగ్ సీటు అని వైసీపీ పోటీ చేసింది. ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక ఇప్పుడు టీడీపీ వెనకా ముందు ఆలోచన చేసినా బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీ చేసేందుకే ఆసక్తితో ఉన్నాయి. ఇక టీడీపీ కూడా తప్పక పోటీ చేసే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ మొత్తం 2.28 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ ఎంపీ సీటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉంది. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉంది.
ఈ నియోజకవర్గంలో రెడ్డి, బలిజ ఓటర్లు ఎక్కువ. ఇక 2014లో కూడా ఇక్కడ ఎంపీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసింది. ఇప్పుడు జనసేన సపోర్ట్ ఉండడంతో బీజేపీ ఖచ్చితంగా లక్ పరీక్షించుకుంటుంది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ చింతా మోహన్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ అయిష్టంగా అయినా పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక వైసీపీపై మిగిలిన పార్టీల విమర్శల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలతోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోనుంది.
-vuyyuru subhash