గాలి జనార్దన్​ రెడ్డి కేసు విచారణ.. విదేశీ దర్యాప్తు సంస్థలకు సీబీఐ కోర్టు లేఖ

-

మాజీ మంత్రి గాలి జనార్దన్​ రెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టారని వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సహకరించాలని 4 దేశాలకు చెందిన దర్యాప్తు సంస్థలను సీబీఐ ప్రత్యేక కోర్టు కోరింది. సింగపూర్, స్విట్జర్లాండ్, యూఏఈ, ఐల్ ఆఫ్ మ్యాన్ (ఐర్లాండ్-ఇంగ్లాండ్ మధ్యలో ఉన్న చిన్న దేశం)లలోని న్యాయశాఖ అధికారులకు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ ఇ. ఇంద్రకళ తాజాగా లేఖలు రాశారు.

జీఎల్ఏ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆయా దేశాలలో పెట్టిన పెట్టుబడులు, కంపెనీ, కంపెనీ తరఫున సంతకాలు చేసిన వారు, బ్యాంకు ఖాతాల వివరాలు, తదుపరి లబ్ధిదారులు, కంపెనీల షేర్ల వివరాలు, వాటిని కొన్న వారు, కంపెనీలలో డైరెక్టర్లు, వాటా దారులు తదితర వివరాలను అందించాలని ఆయా దేశాల ప్రతినిధులకు రాసిన లేఖలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోరింది. 2009-2010 మధ్య 8 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఎగుమతుల ద్వారా వచ్చిన నగదును.. గాలి జనార్దనరెడ్డి ఆయా దేశాలలోని తన బ్యాంకు ఖాతాలలో జమ చేసుకున్నారని సీబీఐ అనుమానిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఆయనకు ఉన్న ఆస్తులను జప్తు చేసుకునే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. ఆయన పేరిట మిగిలిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సీబీఐకి అనుమతిని ఇచ్చింది. దర్యాప్తును వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఈ చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news