ఏపీ డీజీపీకి బాబు లేఖ.. అదే ప్రధాన కారణం !

-

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంపై అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా కలవరం చెందుతున్నారన్న ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై వైకాపా ప్రభుత్వం అనాగరికంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తోందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిపైనే ప్రత్యేకంగా దాడులకు పాల్పడటం హేయమని, దళితులపై దాడుల్లో భాగమే తాజాగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిందని అన్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలో పట్టపగలే రామచంద్రపై దాడి చేయడం దారుణమన్న ఆయన విజయవాడలో సెప్టెంబర్ 26న దళిత మహాసభ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జడ్జి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించిన మరుసటిరోజే ఈ దాడి జరగడం గమనార్హమని అన్నారు.

దీనిని బట్టే అధికార పార్టీ వైసీపీ ప్రోద్భలంతో జడ్జి రామకృష్ణ గొంతు నొక్కడంలో భాగంగానే కుట్ర పూరితంగా ఈ దాడి జరిగినదని రుజువు అవుతోందని అన్నారు. వైకాపా చేస్తున్న ఈ దుర్మార్గ చర్యలన్నీ మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని ఆయన అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న వరుస దాడులు చూస్తుంటే గుండె కలుక్కుమంటోందన్న బాబు వీటన్నింటిపై తీవ్ర ఆవేదనతో పదేపదే మీ దృష్టికి లేఖల ద్వారా తీసుకురావడం జరుగుతోందని అన్నారు. మొగ్గలోనే వీటిని అణిచివేసే చర్యలు చేపట్టకపోవడమే దళితులపై రోజురోజుకూ ఈవిధమైన దాడులు పేట్రేగడానికి ప్రధాన కారణమని బాబు అన్నారు. ఈ దురాగతాలపై తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఈ దాడులు, దౌర్జన్యాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news