బాబూ మీ సొంత నిర్ణ‌యాలు వ‌ద్దు… త‌మ్మ‌ళ్ల డిమాండ్‌…!

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుకు సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను త‌మ్ముళ్లే వ్య‌తిరేకిస్తున్నారు. “ మీరు ఏ నిర్ణ‌య‌మైనా తీసుకోండి అయితే, మాకు చెప్పండి. ఆ త‌ర్వాతే ప్ర‌క‌టించండి “అంటూ త‌మ్ముళ్లు త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నాయి. మ‌రి ఒక్క‌సారిగా ఇలా ఎందుకు డిమాండ్లు తెర‌మీదికి వ‌స్తున్నాయి ? అంటే.. బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో పార్టీ రోడ్డున ప‌డుతోంద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబు చాలా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు త‌న ఇష్టాను సారం టికెట్లు ఇచ్చారు. ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే త‌మ్ముళ్ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. త‌మ‌కు అన‌కూలంగా ఉండే నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వాల‌ని చాలా మంది నాయ‌కులు ఒత్తిడి చేశారు. అదేస‌మ‌యంలో పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన నాయ‌కుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వాల‌ని కూడా డిమాండ్లు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు త‌న‌కు న‌చ్చిన వారిని నియ‌మించారు. దీంతో గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని భావించిన ఎంపీ అభ్య‌ర్థులు కూడా ఓడిపోయారు. దీంతో వారంతా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మ‌రి కొంద‌రు ఎంపీ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో ఓడిపోయాక పార్టీ మారిపోయారు. ఆదినారాయ‌ణ రెడ్డి, సిద్దా రాఘ‌వ‌రావు, బీద మ‌స్తాన్‌రావు, అడారి ఆనంద్‌కుమార్ పార్టీ మారిపోయారు. మ‌రి కొంద‌రు ఎంపీ క్యాండెట్లు రాజ‌కీయ స‌న్యాసం చేసేశారు.

ఇక‌, ఇప్పుడు కూడా చంద్ర‌బాబు ఎవ‌రితోనూ చ‌ర్చించ‌కుండా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు బాబు నిర్ణ‌యించారు. ఈ ప‌రిణామంపై త‌మ్ముళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మార్పులు అత్యంత ముఖ్య‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న నేత‌ల‌ను ఏవో చిన్న‌పాటి కార‌ణాలు చూపించి.. త‌ప్పిస్తే.. మొత్తానికే మోసం ఎదుర‌వుతుంద‌ని.. కాబ‌ట్టి ఏదైనా నిర్ణ‌యం తీసుకునేముందు.. త‌మతో చ‌ర్చించాల‌ని వారు కోరుతున్నారు. మ‌రి బాబు త‌మ్ముళ్ల‌కు వాల్యూ ఇస్తారా?  లేదా?  చూడాలి.

 

-vuyyuru subhash