అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు చేశారని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. జగన్ వస్తే గంజాయి వస్తుందని పేర్కొన్నారు. రూ.500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకుని.. ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయారని ధ్వజమెత్తారు.
టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయదని చంద్రబాబు అన్నారు. వారికిచ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో కొండల్ని జగన్ అనకొండలా మింగేశారని ఆరోపించారు. 3 సార్లు జగన్ బస్సు ఛార్జీలు పెంచారని, కుంభ కోణాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పిలుపునిచ్చారు విశాఖను ఐటీ కేంద్రంగా చేయాలని తాను భావించానన్న చంద్రబాబు.. కానీ గంజాయి కేంద్రంగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని విరుచుకుపడ్డారు.