వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై ఎన్నికల ప్రచారంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో నాయకుడిపై దాడి జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉండగా ప్రమాదం తప్పింది. వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పవన్ కు ఏం జరగకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జనసైనికులు పోలీసులకు అప్పగించారు.

ఇక ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్న సీఎం జగన్ పై శనివారం రాత్రి ఆగంతుకులు రాయి విసిరిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరడంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఆరా తీసింది.
