పదవులు దక్కించుకోవాలన్నా.. ఉన్నపదవులు కాపాడుకోవాలన్నా.. ఎవరైనా ఏం చేస్తారు ? దూకుడుగా వ్యవహరిస్తారు. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తారు. ఇది.. ఎక్కడైనా ఉండేదే. టీడీపీలో ఉన్న నేతలు ఇప్పటికీ.. దూకుడుగా ఉంటేనే పార్టీలో గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు. ఇక, అధికార వైసీపీలోనూ చాలా మంది ఫైర్ బ్రాండ్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నవారే. అయితే, అనూహ్యంగా ఓ మంత్రిగారు మౌనం పాటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన దూకుడు ప్రదర్శించారు. నియోజకవర్గం, జిల్లాలోనూ ఓ `చుట్టు చుట్టేశారు`. నేతలు ఎవరైనా తనకు లెక్కలేనట్టు వ్యవహరించారు.
అంతేకాదు, తనకు సంబంధం లేని శాఖల్లోనూ వేలు పెట్టి విమర్శలు గుప్పించారు. అదే తానైతే.. అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, విపక్షంపైనా విమర్శలు బాగానే సంధించారు. మరి ఇంతగా రెచ్చిపోయిన సదరు మంత్రి వర్యులు ఇప్పుడు మాత్రం మౌనం పాటిస్తున్నారు. రీజనేంటి? అక్కడికే వస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ప్రముఖ రైస్ మిల్లర్, మిల్లర్ల సంఘానికి అధ్యక్షుడు కూడా అయిన శ్రీరంగనాథరాజుకు దూకుడు ఎక్కువనే పేరుంది. సహజంగానే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఒకింత పౌరుషం.. దూకుడు ఎక్కువనే పేరుంది.
ఈ వర్గానికే చెందిన రంగనాథరాజుకు మరింత దూకుడు ఎక్కువనే పేరు వచ్చింది. వయసును పక్కన పెట్టి మరీ ఆయన ఎవరితోనైనా తలపడతారని అంటారు ఆయన అనుచరులు. ఇక, జిల్లాలోని కనీసం నాలుగైదు నియోజకవర్గాల్లో పట్టు సాధించారు. అన్నీ తన కనుసన్నల్లోనే సాగిస్తున్నారు. టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేను కూడా వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆయన కృష్ణాజిల్లాకు చెందిన మంత్రిని కూడా రాజుగారు టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదని అందరూ చెప్పుకొన్నారు. ఆన్‌లైన్, సోషల్ మీడియాల్లోనూ ఇదే తెరమీదికి వచ్చింది.
ఈ నేపథ్యంలో.. త్వరలోనే జరగబోయే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈయనకు చెక్ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఇక, అప్పటి నుంచి రాజుగారు సైలెంట్ అయ్యారని అంటున్నారు నియోజకవర్గం నేతలు. ఇక, ఆయన దూకుడు ఎక్కడా కనిపించకపోవడం, ఎవరినీ టార్గెట్ చేయకపోవడం.. పెద్దగా దూకుడు లేకపోవడం వంటివి గమనిస్తే..నిజమేనేమో.. మంత్రిగారిలో పదవిపై భయం పట్టుకుందేమో.. అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే ఆయన మౌనం పాటిస్తున్నారేమో.. అని గుసగుసలాడుతున్నారు.
-vuyyuru subhash