టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డుపై లింగమనేని రమేష్‌కు చెందిన డోర్ నంబర్ 17-3-378/1 గల ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు.
రాజధాని నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది.
అందుకు ప్రతిగా… లంచం/క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారనేది సీఐడీ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిస్తున్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణ.. బినామీల పేరిట కొన్న ఆస్తులుగా పేర్కొంటూ మరికొన్నింటిని జప్తు చేసేందుకూ అనుమతి జారీచేసింది.