ఏపీ సిఐడి వైసిపి జేబు సంస్థగా మారిందని ఆరోపించారు టిడిపి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. సోమవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో జగన్ 2.50 లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జగన్ ఆర్థిక నేరస్థుడు అని దర్యాప్తు సంస్థలే చెప్పాయన్నారు.
ఒక్క రోజైనా చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఆతృత తప్ప.. కేసులో పసలేదన్నారు యనమల. తప్పుడు కేసులతో చాలామంది జైలు పాలు అవుతున్నారని అన్నారు. చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు వచ్చిందని, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయని, అలాంటి చంద్రబాబుపై ఫాబ్రికేటెడ్ స్టోరీ అల్లి అరెస్టు చేశారని మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం ఉందనడం సరికాదన్నారు యనమల. జగన్ లండన్ కి ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన యనమల.. నేడు ఆయన తిరిగి వస్తున్నారన్న ఉద్దేశంతో జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిఐడి అధికారులు, పోలీసులు ఇదంతా చేశారని ఆరోపించారు.