సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీని విష సర్పంతో పోల్చారు. ఆదివారం తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని అన్నారు.
‘‘విష సర్పం ఇంట్లోకి వస్తే.. దానిని తీసి బయట పడేస్తే కుదరదని.. అది ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుందని.. ఆ చెత్తను తీసేసే వరకూ అది ఇంట్లోకి వస్తూనే ఉంటుందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ సన్నివేశంతో ప్రస్తుత పరిస్థితి పోలిస్తే.. తమిళనాడు ఇల్లు. బీజేపీ ఓ విష సర్పం. అన్నాడీఎంకే ఇంటి వద్ద ఉన్న చెత్తలాంటిదని అభివర్ణించారు. చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదని.. బీజేపీ నుంచి విముక్తి పొందాలంటే.. అన్నాడీఎంకేను తొలగించాలని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
‘సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అంటూ ఇటీవల ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్‌పై ఓవైపు రాజకీయ నేతలు.. మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు ప్రజలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి.