టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా?, ఉండదా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతుందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటుంటే, కొందరు మాత్రం ఉండొద్దని కోరుకుంటున్నారని, ఆల్రెడీ ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామిగా ఉందని, ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారని తెలిపారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏ కూటమిలో కొనసాగడానికి వీలులేదని బీజేపీ నాయకత్వం పేర్కొనలేదని వెల్లడించారు.
అదే సమయంలో టీడీపీ నాయకత్వం కూడా, ఎన్డీఏ కూటమిలో కొనసాగితే మాతో పొత్తు కుదరదని ఎక్కడా కూడా చెప్పలేదని అన్నారు. ఈ మూడు పార్టీలు ఇప్పటి వరకు చక్కటి సమన్వయంతో కొనసాగుతున్నాయని, ఒకరితో ఉన్న స్నేహాన్ని మరొకరు తమ సొంతం చేసుకుంటున్నారని, దీంతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఎవరైనా చెప్పేవరకు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నట్లే లెక్కని ఆయన తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తున్నామని ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ నాయకత్వం కూడా చెప్పే అవకాశం లేదని, జనసేన పార్టీ కామన్ లింకు ద్వారా కలిసి ఉన్న టీడీపీ, బీజేపీలు రానున్న ఎన్నికల్లో కలిసే వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుందని చెప్పారు.