రేవంత్ కే అధ్యక్ష పీఠం? సిగ్నల్స్ ఇస్తున్న అధిష్టానం

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో చాలా కాలం నుంచి ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. పిసిసి అధ్యక్ష పీఠం తమకు దక్కుతుంది అంటే తమకు దక్కుతుందని  నాయకులంతా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న వారి దగ్గర నుంచి చి యువ నాయకులు వరకు అంతా పిసిసి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వీరందరిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు గా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
Revanth Reddy be new TPCC chief
దీనికి తగ్గట్టుగానే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా తమిళనాడుకు చెందిన మణికంఠ ఠాకూర్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం ఠాకూర్ తమిళనాడులోని విరుదు నగర్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ గా ఉన్నారు. యువ నాయకుడు అయిన ఈయన ను తెలంగాణ ఇన్చార్జి నియమించడంతో, కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక పైన ఇప్పుడు రేవంత్ ఆశలు పెరుగుతున్నాయి. కొత్త ఇన్ఛార్జిగా యువ నాయకుడు రావడంతో పిసిసి అధ్యక్ష పీఠం కూడా ఇస్తారని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే పిసిసి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎంపీలు రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి , భట్టి విక్రమార్క ఇలా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ హైకమాండ్ యువ నాయకులకు పిసిసి అధ్యక్ష పీఠం కట్ట బెడుతుందనే ప్రచారం జోరు అందుకోవడం తో పాటు, ప్రస్తుతం ఇన్చార్జిగా యువ నాయకుడు నియామకానికి కూడా అదే కారణాలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ లో చోటుచేసుకున్న మార్పుచేర్పులను పరిశీలిస్తే, సీనియర్ల కంటే యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అదీ కాకుండా కొత్తగా తెలంగాణ పార్టీ ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ ఠాకూర్ తో రేవంత్ రెడ్డికి స్నేహం కూడా ఉండడంతో, ఇవన్నీ కలిసి వస్తాయని, కెసిఆర్ కేటీఆర్ దూకుడును అడ్డుకునేది కేవలం రేవంత్ మాత్రమే అనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో సైతం ఉండడం, ఇవన్నీ తనకు ప్లస్ పాయింట్ గా రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ నుంచి కూడా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటంతో రేవంత్ వర్గంలో ఆనందం కనిపిస్తోంది.
-Surya