కోటంరెడ్డికి బెదిరింపులు.. బండికి కట్టి లాక్కుపోతా అంటూ వార్నింగ్

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం రోజున మీడియా సమావేశం నిర్వహించి అధికార పార్టీ, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలకు సజ్జల పంపిన ఆడియో రికార్డును సైతం ప్రెస్ మీట్‌లో ప్లే చేశారు. ఈ ఘటనతో కోటంరెడ్డికి అధికార పార్టీ కార్యకర్తల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

‘ముఖ్యమంత్రి జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య లాక్కొని వెళ్తాను. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరం లేదు. అయిదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా’ అంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

తనను తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకొన్న అనిల్‌.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు నీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొట్టే రోజు చూడు. డేట్‌ ఫిక్స్‌ చేసుకో! నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అంటూ బెదిరించాడు. తాను ముఖ్యమంత్రిని ఏమీ అనలేదని చెప్పినా.. వినకుండా ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాపోయారు.