దేవినేని లిక్కర్ బాధలో క్లారిటీ ఎంత?

-

అసలు టీడీపీ నేతలకు లిక్కర్ అమ్మకాలు.. మద్యంతో ప్రజల ప్రాణాలు.. రాష్ట్రంలో సారా ఏరులు.. వంటి అంశాలపై మాట్లాడే కనీస అర్హత ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా ఏపీలో లిక్కర్ అమ్మకాలపై టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. ప్రభుత్వషాపుల్లో నాసిరకంమద్యం. బయట రాష్ట్రాలనుండి విచ్చలవిడిగా ఎన్.డి.పి లిక్కర్. మీ పార్టీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు. రాష్ట్రంలో సారా ఏరులైపారుతుంది. నాసిరకంమద్యం, సారాలతో పోతున్న ప్రజలప్రాణాలకు, మీనేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు? అంటూ ఏపీ సీఎం జగన్ ని ప్రశ్నించారు! అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ లిక్కర్ బాదలో దేవినేనికైనా క్లారిటీ ఉందా అనేది పలువురి ప్రశ్న!

బీర్ ని హెల్త్ డ్రింక్ అని చెప్పే మంత్రులను కేబినెట్ లో ఉంచి, మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుగా మార్చి, జనాలకు పిచ్చిగా అలవాటుచేసి, బెల్టు షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహించింది చంద్రబాబు అనేది నిర్వివాదాంశం! మద్యపాన నిషేధం అనే నినాదంతో ఆడపడుచుల కళ్లల్లో ఆనందాలు నింపిన స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ అధికారంలో ఉన్నంతకాలం.. ఆయన ఆశయాలకు తగ్గట్లు ఏనాడూ బాబు పరిపాలన చేయలేదు అనే విమర్శ ఉండనే ఉంది. ఈ క్రమంలో జగన్.. దశలవారీగా మద్య నిషేధం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.. అందులో భాగంగా ఆయన ప్లాన్స్ ఆయన అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల విమర్శల్లోనే క్లారిటీ మిస్సవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో మద్యం వద్దు అనేది దేవినేని ఉద్దేశ్యమా.. మంచి బ్రాండులు అని వారు చెప్పే బ్రాండులు మాత్రమే అమ్మాలనేది వారి ఆలోచనా.. వారి దృష్టిలో నాసిరకం మద్యం అంటే ఏమిటి.. మద్యంతోనూ, సారాలతోనూ ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న విషయం వారికి ఇప్పుడు గుర్తుకు రావడానికి మించిన జోక్ ఇంకొకటి ఉందా..? ఉమకే తెలియాలి! “మద్యం వద్దు.. ఎన్టీఆర్ నినాదమే ఇప్పుడు మా నినాదం కూడా. మధ్య నిషేధం ఒకేసారి అమలు చేసెయ్యండి” అని అయినా అనాలి… లేదా “మద్యం పుష్కలంగా అందించండి” అని ఐనా అనాలి!

కాసేపు మద్య నిషేదం ఎప్పుడు అని అంటారు… కాసేపు ఏపీలో మద్యం దొరకడం లేదని చెబుతారు… మరోసారి సరైన బ్రాండ్లు లేవని వాపోతారు! ఈ సమయంలో జగన్ ని విమర్శించాలనుకుంటే… దశలవారీగా మద్యం అమ్మకాలు ఎత్తే విషయంలో ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్స్ ఏమిటి అని అడ్గడంలో అర్ధం ఉంది కానీ… కాసేపు “మద్యం ఎత్తేస్తానన్నారుగా ఎత్తలేదు” అని ఒకరంటే… సరైన మద్యం దొరకడం లేదని మరొకరంటే… తమకు నచ్చిన బ్రాండ్స్ లేవని ఇంకొకరంటే… మద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పని ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లు ఒకరంటే.. జనాలు మాత్రం ఎలా అర్ధం చేసుకోవాలి? పార్టీ మొత్తానికి క్లారిటీ లేకపోయినా.. కనీసం మాట్లాడేవారికైనా క్లారిటీ ఉండాలిగా!?

Read more RELATED
Recommended to you

Latest news