టీడీపీలో అసంతృప్తి సెగ‌లు… ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే..!

-

ఉత్త‌రాంధ్ర టీడీపీలో ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు జంప్ చేస్తార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ స‌మ‌యంలో ఉన్న వారినైనా కాపాడుకోవాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంది. అయితే, దీనికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక వేసుకుని ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకోక పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ముఖ్యంగా విశాఖ‌నే తీసుకుంటే.. ఒక్క విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారు పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. కార్య‌క్ర‌మాల‌కు చాలా దూరంగా ఉంటున్నారు. పోనీ.. రామ‌కృష్ణ‌బాబుకైనా పూర్తిస్థాయిలో బాథ్య‌త‌లు అప్ప‌గించారా? అంటే.. లేదు. దీంతో ఆయ‌న పిలుపునిచ్చినా. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే నాయ‌కులు ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో ఇంకా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు చేతిలోనే పార్టీ ప‌గ్గాలు ఉన్నాయి. ఆయ‌న చెప్పిందే అక్క‌డ వేదం. ఆయ‌నేమైనా.. యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. గ‌డ‌ప దాట‌డం లేదు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తె అదితికి టికెట్ ఇచ్చినా.. ఓడిపోయారు. అయితే, ఆమె ఇటీవ‌ల కాలంలో కొంత మేర‌కు యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే, ఆమెకు కూడా ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. ఇక‌, మాజీ మంత్రి సుజ‌య్ కృష్ణ‌రంగారావు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గ‌తంలో మైనింగ్ శాఖ మంత్రి గా ఉన్న‌ప్పుడు అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇప్పుడు తాను క‌నుక జ‌గ‌న్ పై యుద్ధం చేస్తే.. వాటిని ఎక్క‌డ బ‌య‌ట‌కు తీస్తారోన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో విజ‌య‌న‌గ‌రంలో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక‌, శ్రీకాకుళంలో ఏకంగా ఏకంగా పార్టీకి  రాష్ట్ర అధ్య‌క్షుడుగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ విష‌యాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదో విజిటింగ్ నాయ‌కుడిగా మారిపోయారు. ముఖ్యంగా క‌రోనా ఎఫెక్ట్‌తో ఆయ‌న అస‌లు గ‌డ‌ప దాటి బ‌య‌టకు రావ‌డం లేదు. ఏదైనా విమ‌ర్శ‌లు చేస్తే.. మ‌మ అనిపించి వెళ్లిపోతున్నారు. ఇక‌, ఎంపీగా ఉన్న రామ్మోహ‌న్ నాయుడు, ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడుల‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు త‌గ్గుతోంద‌నే భావ‌నలో ఉన్నారు.

ఇటీవ‌ల అచ్చెన్న అరెస్టు విష‌యం అలా ఉంచితే.. బెయిల్ ఇప్పించ‌డంలోనూ చంద్రబాబు స‌హ‌క‌రించ‌లేక పోతున్నార‌నే ఆవేద‌న వారి కుటుంబంలో క‌నిపిస్తోంది. దీంతో వీరు కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఉత్తరాంధ్ర టీడీపీ కునారిల్లుతోంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news