అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీని కోసం వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఇది చారిత్రాత్మక పరిణామం అన్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.
అలాగే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సజ్జల స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనన్నారు. ప్రజల అంశాల పై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. పోటీ పెరగటం వల్ల పని తీరు మెరుగుపడి ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. మాది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని.. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామన్నారు.
ప్రజలు మా పార్టీని ఓన్ చేసుకొన్నారని తెలిపారు సజ్జల. కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నామన్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదని.. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చిందన్నారు.