దుట్టాని ఎగదోస్తుంది ఎవరు..వంశీకి చెక్ పెట్టడానికే…!

-

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు బాగా ఎక్కువైపోతుంది. ఎక్కడికక్కడే కొత్త నేతల రాక పెరగడంతో పలు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వంశీ డామినేషన్ ఎక్కువైందని, ఆయన అసలు నిజమైన వైసీపీ కార్యకర్తలని పట్టించుకోవడం లేదని చెప్పి దుట్టా పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పా, వైసీపీ కార్యకర్తలని పట్టించుకోవడంలేదని దుట్టా అసంతృప్తితో ఉన్నారు. దుట్టావి ఆరోప‌ణ‌లే అనుకోలేం.. వాస్త‌వంగా గ‌న్న‌వ‌రంలో ప్ర‌స్తుతం ఆయ‌న చెప్పిన ప‌రిస్థితే ఉంది. అలాగే గన్నవరం ఉపఎన్నిక జరిగితే సీటు తనకే ఇవ్వాలని, లేదంటే వంశీకి సహకరించమని అధిష్టానానికి తేల్చిచెప్పేశారు కూడా. అయితే గన్నవరంలో గ్రూప్ రాజకీయం తగ్గించడానికి వైవీ సుబ్బారెడ్డి సైతం రంగంలోకి దిగి, నియోజకవర్గంలో పరిస్థితులని సద్దుమనిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే దుట్టా, వంశీలతో మాట్లాడి కలిసి పనిచేసుకోవాలని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కానీ వైవీ ఎంత చెప్పినా గన్నవరంలో దుట్టా వర్గం అయితే ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు కనబడుతోంది. అందుకే వైఎస్సార్ వర్ధంతి సమయంలో కూడా దుట్టా వర్గం వైఎస్సార్ విగ్రహానికి ముందే పూల మాల వేసి వంశీకి షాక్ ఇచ్చారు. దుట్టా మాత్రం ఆ పని తాము చేయలేదని చెప్పినా, వంశీ వర్గం మాత్రం నమ్మే పరిస్తితిలో లేదు. అయితే గన్నవరంలో దుట్టా వర్గం ఇంత చేస్తున్నా సరే వైసీపీ అధిష్టానం ఆయన్ని మందలించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని వంశీ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.

బహిరంగంగానే దుట్టా, వంశీ మీద విమర్శలు చేసినా అధిష్టానం పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వంశీ సైలెంట్‌గా ఉంటున్నా దుట్టా ప‌దే ప‌దే విమ‌ర్శ‌లతో వంశీని క‌వ్విస్తున్నారు. పైకి కలిసి పనిచేయమని చెప్పినా, వెనుక మాత్రం దుట్టాని వైసీపీ పెద్దలే ఎగదోస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గ పెద్దల సపోర్ట్ దుట్టాకు బాగా ఉందని, అందుకే ఆయన ఏం మాట్లాడినా అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భావిస్తున్నారు. ఇక దుట్టా అల్లుడు అదే రెడ్డి వ‌ర్గం నేత శివ‌భ‌ర‌త్ రెడ్డి  హంగామా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గానే ఉంది. మొత్తానికైతే గన్నవరం రాజకీయాల్లో వంశీకి చెక్ పెట్టే కార్యక్రమం ఏదైనా జరగొచ్చని తెలుస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news