రాజకీయాల్లో సలహాలు తీసుకోవాల్సిందే! అయితే, సదరు రాజకీయం బాగుపడేలా.. ఉండాలి. సదరు రాజకీయ నేతలకు మేలు చేసేలా ఉండాలి.. ఆ సలహాలు. కానీ, కొందరి సలహాలు.. రాజకీయంగానే ఉనికి లేకుండా చేస్తే.. ఆయా సలహాలు ఏకంగా పార్టీకి ఎసరు పెట్టేలా ఉంటే.. ఏం జరుగుతుంది? ఇదిగో ఇప్పుడు జనసేనాని పవన్ మాదిరిగా పుట్టి ముంచుకునే పరిస్థితి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి.. సొంత పార్టీ పెట్టుకున్న పవన్.. ప్రశ్నిస్తానంటూ.. ప్రజలకు అండగా ఉంటానంటూ.. డైలాగులు బాగానే పేల్చారు.
అయితే, ఇప్పుడు అవే ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. ఆయనను ఒంటరిని చేశాయి అంటున్నారు పరిశీలకులు. ఆది నుంచి ఓ కీలక నాయకుడి సలహాలతో పవన్ ముందుకు సాగుతున్నారని ఎప్పటి నుంచో పాలిటిక్స్‌లో ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఆయన 2014లో పార్టీ పెట్టినా దూరంగా ఉన్నారని, తర్వాత అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి.. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారని, ఆయన సలహాతోనే టీడీపీ-బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి.. సొంతగా పోటీచేసి.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు చీల్చి.. పరోక్షంగా మరో పార్టీకి సహకరించాలని ప్రయత్నించారని టాక్ నడిచింది.
ఎక్కడో ఉన్న బీఎస్పీ అధినేత మాయావతికి స్టేజీలపై పొర్లు దండాలు పెట్టడం కూడా సదరు నాయకుడి సలహానేనని చెప్పుకొనేవారు. ఇక, కొన్నాళ్ల కిందట బీజేపీతో అంటకాగేందుకు రెడీ అవడం వెనుక కూడా సదరు సీనియర్ నాయకుడి సలహా మేరకేనని ప్రచారంలో ఉంది. అయితే, ఇది పవన్‌కు ఏమేరకు మేలు చేస్తోంది? అనేది చూసుకోకుండా ఆయన గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సినీ రంగంలోకి వెళ్లారు. వరుసగా సినిమాలు ఒప్పుకొంటున్నారట.
అంటే.. క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టేందుకు కానీ, తనను నమ్ముకున్న నాయకులకు లైఫ్ ఇవ్వడం కానీ, ప్రజలకు భరోసా కల్పించడం కానీ.. పవన్‌కు ఇప్పుడులేవు. కేవలం ఓ వ్యక్తి సలహాలు సూచనలే ఆయనకు ముఖ్యం!! దీంతో ఇప్పుడు ఆయన వేస్తున్న అడుగులు ఆయన ఉనికినే లేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అంటే.. ప్రజల తరఫున పోరాటం.. ప్రశ్నించడం.. చేగువేరా..? అల్లూరి.. మార్గదర్శకాలు.. ఇవన్నీ ఇక బుట్టదాఖలేనన్నమాట!! ఇదీ ఇప్పుడు జనసేనలో పవన్ అభిమానుల టాక్!!
-vuyyuru subhash