టీడీపీకి వచ్చిన 27 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో స్కాం ద్వారా వచ్చినవేనని సీఐడీ తరఫున వాదనలను వినిపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేస్తున్న వాదన విచిత్రంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులలో పారదర్శకత ఉండాలని ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, 2000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వాలంటే ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారానే ఇవ్వాలని పార్లమెంట్లో ఆమోదించి చట్టం చేసిందని తెలిపారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 17 నుంచి 18 వేల కోట్ల రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా స్వీకరించాయని ఆయన గుర్తు చేశారు.
టీడీపీకి వచ్చిన 27 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి రాద్ధాంతం చేస్తున్న వారు, వైకాపాకు ఒకే సంవత్సరంలో ఒకసారి 20 కోట్లు, మరొకసారి వచ్చిన 300 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. వైకాపాకు మొత్తం 600 కోట్ల రూపాయల నిధులు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సమకూరాయని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు కేవలం 10 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరితే, ప్రాంతీయ పార్టీ అయిన తమ పార్టీకి 300 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. తమ పార్టీకి నిధులు ఇవ్వడానికి ప్రూడెన్షియల్ ఎలక్టోరల్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టిన మహానుభావుడు ఎవరు?, ఆ మహానుభావుడికి 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినం దుకు ప్రతిఫలంగా, వైకాపా ప్రభుత్వం చేకూర్చిన మేలు ఏమిటన్నది బహిర్గతం చేయాలని అన్నారు.