టీడీపీకి రోల్ మోడ‌ల్‌గా మారిన‌.. మాజీ వ్య‌వ‌సాయాధికారి

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో యువ ఎమ్మెల్యేగా గుర్తింపు పొంద‌డ‌మే కాకుండా .. త‌న‌దైన శైలిలో దూసుకు పోతున్నారు ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు. గ‌తంలో వ్య‌వ‌సాయ అధికారిగా హార్టీక‌ల్చ‌ర్ విభాగంలో ప‌నిచేసిన ఆయ‌న పరుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. పార్టీని న‌డిపించ‌డంతోపాటు.. వ్య‌వ‌సాయంలోనూ ఆయ‌న త‌న దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వంటి కీల‌క నాయ‌కుడికి బ్రేకులు వేసి.. టీడీపీ స‌త్తా చాటిన ఏలూరి రాజ‌కీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు.

 

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ జోరుగా సాగినా.. త‌న‌దైన హ‌వాను ఏలూరి నిల‌బెట్టుకున్నారు. ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే ఉత్తమ యంగ్ ఎమ్మెల్యేగా అవార్డు సైతం పొందారు. ముందు చూపు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే విధానంలో ఏలూరికి ఏలూరే సాటి.. అన‌ద‌గిన నాయ‌కుడు. మొత్తంగా చూస్తే.. వ్యూహం, రాజ‌కీయంగా దూకుడు ఉన్న నాయకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు పార్టీ పార్ల‌మెంట‌రీ జిల్లా ల‌కు అత్యంత ముఖ్య‌మైన నాయ‌కుల‌ను ఇంచార్జ్‌లుగా నియ‌మించారు. వీరిలో ఐదారుగురు నేత‌ల‌పై చంద్ర‌బాబు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకోగా వారిలో ఏలూరి కూడా ఉన్నారు.

ఏలూరి ప్లానింగ్‌, అంకిత‌భావ‌మే ఆయ‌న‌కు పార్టీ పార్ల‌మెంట‌రీ జిల్లా చీఫ్ బాధ్య‌త‌లు ద‌క్కేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు. మంగ‌ళ‌వారం ఏలూరి సాంబ‌శివ‌రావు.. బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లా చీఫ్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు పార్టీ నాయ‌కులు ఏర్పాట్లు చేశారు. బాప‌ట్ల‌లోని ఎం.ఎస్‌.ఆర్ క‌ళ్యాణ‌మండ‌పంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఏలూరి.. బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

మొత్తం 25 పార్ల‌మెంట‌రీ జిల్లాల అధ్యక్షులను నియ‌మించినా మ‌హా అయితే ముగ్గురు న‌లుగురు నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పార్టీకి మాంచి ఊపు రాగా అందులో బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఏలూరి ఇదే స‌మ‌య‌స్పూర్తితో బాపట్ల పార్ల‌మెంటు ప‌రిధిలో కేడ‌ర్‌, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో వైసీపీకి సులువుగానే చెక్ పెట్టొచ్చు.