కరోనా వలన ఇంతకు ముందు చూడనివి అన్నీ చూడాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదని చెబుతున్న ప్రభుత్వాలు ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జనాల్లో పలు అనుమానాలు తీరడం లేదు. తాజాగా కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకి పసివేదల గ్రామానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, ఆమె కొడుకు కూతురు ముగ్గురూ దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే పసివేదల గ్రామానికి చెందిన పరిమి సునీత భర్త నరసయ్య ఈనెల 16వ తారీకున కరోనాతో మృతి చెందారు. అయితే కరోనా నిబంధనల ప్రకారం పోలీసులే దహన కార్యక్రమాలు చేసేశారు. అదంతా పూర్తయ్యాక కూడా కనీసం కుటుంబ సభ్యులు, బంధువులు సైతం పలకరించడానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై కుటుంబంతో సహా అంటే ఇద్దరు పిల్లలతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పరిమి సునీత(50),కుమారుడు పరిమి ఫణి కుమార్ (25), కుమార్తె పరిమి లక్ష్మీ అపర్ణ (23)లు ముగ్గురూ చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.