తెలంగాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా దీని బారిన పడ్డారు. తాజాగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే సురేందర్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కాగా, తొలిసారిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకడంతో కలకలం రేగింది.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.